Tuesday, October 20, 2020

​​మూడు వారముల పార్క్ రిడ్జి జీవితం

గడచిన వారం రోజులనుండి ఈ బ్లాగ్ వ్రాయాలనే నా ప్రయత్నం ఈ రోజు సుసంపన్నం అయింది. ముఖ్యంగా పోయిన ఆదివారం నాటి అర్ధశత కి.మీ. దూరంతో హైదరాబాద్ లో మొదలయిన నా సైకిల్ ప్రయాణం నాకు ఉత్సాహాన్ని ఇచ్చి ఉండవచ్చు. 


సెప్టెంబర్ 26 వ తేదీ శనివారం రోజున ఉ. 5:30 ని.లకు పుణే నగరం నుండి మొదలయిన నా కుటుంబ ప్రయాణం సాయంత్రం గం 5:30 ని.లకు హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో నా ఇంటి వద్ద ముగిసింది. ఆ రాత్రికి పొరిగింటి వారి సహృదయంతో వారి ఇంటిలోనే సేదతీరాము. ముఖ్యంగా శ్రీ స్వరూప్ గారికి మరియు 202 ఇంటి యజమాని గారికి ధన్యవాదములు. శ్రీ చౌదరి గారు మేము చేరే ముందుగానే మా ఇంటిని సిద్ధం చేయించడంలో ఎంతో సాయం అందించారు. ఆదివారం రోజున మా ఇంటిలో రంగులు వేయడం పూర్తి చేయించుకొని మరియు శుభ్రం చేయించుకున్నాము. నా ఆప్తమిత్రుడు మల్లిక్ రాగంపూడి సహృదయంతో నాటి విందుభోజనం ఆరగించాము. మరుసటి రోజు సోమవారం నా స్వగృహప్రవేశం చేశాము. ఆ తరువాత రెండు రోజులు పుణే నుండే పరిచయం ఉన్న కుటుంబ మిత్రులు శ్రీ సంపత్ కుమార్ గారు భోజన ఏర్పాట్లు చేశారు.


తదుపరి గురువారం వరకూ పుణే నుండి సామానులు రాకపోయినా ఏవిధమైన అసౌకర్యము లేకుండా గడిపాము. ముఖ్యంగా ఉదయభానుని కిరణాలు మా ఇంటిని ముద్దాడుతూ ఉంటే పరమానంద భరితులమయ్యాము. పైనున్న మిద్దె మీదకు ఉదయమే చేరే పక్షులను చూస్తుంటే సమయాభారం అనిపించలేదు. రోజంతా వీచే చల్లని గాలి, సాయంత్రం అయ్యేసరికి కురిసే వర్షపు జల్లులు మరింత ఆహ్లాదాన్ని కలిగించేవి. చిన్న చిన్న అవసరాలకు దగ్గరలో ఉండే అంగళ్లు చాలా అనువుగా ఉన్నాయి. ముఖ్యంగా కూరగాయలు, ఉప్పు, ముగ్గు లాంటి వస్తువులు ప్రతీ వీధిలోకి రావడం చూసి పల్లెటూరి వాతావరణం పట్టణానికి వచ్చేసిందా అని తలపించింది, ఆనందమనిపించింది.


ఇకపోతే, పార్క్ రిడ్జి ప్రాంగణం చాలా సుందరంగా ఉంది. ఏడు సంవత్సరాల ముందు ఏవిధమైన రంగులు చూశానో అవే రంగులతో అంతే అందంగా కనిపించింది. పార్కింగ్ మరియు దాని చుట్టూ ప్రాంగణం కూడా చాలా అనువుగా నిర్వహించారని అనిపించింది. ప్రాంగణ భద్రతకు సంబందించి కెమేరాల పర్యవేక్షణ కూడా ఎంతో స్వాంతనను చేకూర్చింది. హమ్మయ్య ఇక్కడ భద్రతకు పెద్ద పీట వేసి తగిన ఏర్పాటు చేశారని అనుకున్నాము. చిన్న చిన్న మొక్కలకు ఏర్పాటు చేసిన ప్రదేశం కూడా చాలా అనువుగా ఉంది. నీటి నిల్వకు సంబంధించి రెండు విడి విడి ట్యాంక్ ల ఏర్పాటు కూడా బాగుంది. తగు విశాలమైన మెట్లు పైకి, క్రిందకు తిరగడానికి అనువుగా ఉన్నాయి. వరండాలు కూడా వెడల్పుగా ఉన్నాయి, కొంత మంది అందమైన అలంకరణలతో ఇంకా అందంగా ఉండేటట్లు చేశారు. బహు విశాలమైన మిద్దె, అందులో చిన్న పిల్లలకు ప్రత్యేకంగా క్రీడావినోదాలకు ఏర్పాటు చేసిన గది కూడా బాగుంది. పెద్దలు ఉదయమే నడవడానికి, మధ్యవయస్కులు వ్యాయామాలు చేసుకోవడానికి మరియు చిన్న పిల్లలకు కొన్ని అనువైన క్రీడలకు ఎంతో వెసులుబాటుగా ఉంది.


ఇక నీటి సదుపాయం గురించి కొంతమంది చేసిన కృషిని మీలో మరికొంతమంది ద్వారా తెలుసుకున్నాను. ఎక్కువ పరిమాణం గల పైపు సదుపాయాన్ని సాధించిన వారందరికీ ఈ ప్రాంగణంలో నివాసితులు అందరూ రుణపడి ఉంటారని నా అభిప్రాయం. నీటి సరఫరాకు సంబంధించిన సదుపాయాలు కూడా చాలా అనువుగానే ఏర్పాటు చేశారని గ్రహించాను.


అన్నిటికీ మించి పైన ఉదహరించిన చాలా మౌళిక సదుపాయాల నిర్వహణను ఎంతో సమర్ధవంతంగా చేశారని అనిపించింది. నా అనుభవంలో ఇటువంటి సదుపాయాలను బాధ్యతగా నిర్వహించలేక పాడయిపోయినవి ఎన్నో స్వయంగా చూశాను. ఈ సదుపాయాల నిర్వహణకు ఎవరైతే శ్రమదానం చేశారో వారందరికీ మా ధన్యవాదములు.


ఇక నా స్వవిషయానికి వస్తే, నా స్వగ్రామం నిడదవోలు. నా భార్య, ఇద్దరు ఆడపిల్లలు మరియు అమ్మ. నేను పుణేలో గల ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. నా భార్య లలితాదేవి కుటుంబ నిర్వహణ బాధ్యతలో సదా నిమగ్నమై ఉంటుంది. మా అమ్మాయిలు హరిచందన మరియు సిరివందన, ఇద్దరూ మొదటి రోజునుండే అంతర్జాల సహాయంతో జరుగుతున్న పాఠాలతో విరామం లేకుండా ఉన్నారు, మధ్య మధ్యలో పరీక్షలు కూడా వ్రాయడం జరిగింది. పెద్దమ్మాయి హరిచందన 11 వ తరగతి సెంటియా విద్యాలయం, హైదరాబాద్ నగరం లో చదువుతోంది. చిన్న అమ్మాయి సిరివందన 7 వ తరగతి పుణే లోని విద్యాలయంలోనే చదువుతోంది. మా అమ్మ ఆదిలక్ష్మి మా అందరికీ మార్గదర్శనం చేస్తూ దైవ చింతనలో సమయం గడుపుతూ ఉంటుంది.


సామానులు చేరిన రోజు నుండి మొదలయిన మా గృహకార్యం ఈ నాటికీ కూడా విరామం లేకుండా జరుగుతూనే ఉంది, మరో నెల రోజుల వరకూ ఉంటుంది అని భావిస్తున్నాము.


పుణేలో వానలకు అలవాటు పడిన మా కుటుంబానికి ఇక్కడి వాతావరణం బాగా నచ్చింది. ప్రస్తుత సామాజిక వాతావరణంలోని కరోనా వ్యాధి ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటివరకూ మీ అందరినీ స్వయంగా వచ్చి పరిచయం చేసుకోనందుకు అన్యధాభావించవద్దు. తెలుసో, తెలియకో మా ద్వారా మీకు ఏదైనా అసౌకర్యం కలిగితే క్షంతవ్యులము.


సుదీర్ఘమైన ఈ బ్లాగును చదివినందుకు ధన్యవాదములు. వీలయితే ఈ ప్రాంగణంలో మా నివాసమునకు మీ సలహాలు మరియు సూచనలు తెలుపండి.

మీ సహనివాసి,
నటరాజు

మూడు వారముల హైదరాబాద్ జీవితం

 మూడు వారముల హైదరాబాద్ జీవితం


గడచిన వారం రోజులనుండి ఈ బ్లాగ్ వ్రాయాలనే నా ప్రయత్నం ఈ రోజు సుసంపన్నం అయింది. ముఖ్యంగా పోయిన ఆదివారం నాటి అర్ధశత కి.మీ. దూరంతో హైదరాబాద్ లో మొదలయిన నా సైకిల్ ప్రయాణం ఉత్సాహాన్ని ఇచ్చి ఉండవచ్చు. 


సెప్టెంబర్ 26 వ తేదీ శనివారం రోజున ఉ. 5:30 ని.లకు పుణే నగరం నుండి మొదలయిన నా కుటుంబ ప్రయాణం సాయంత్రం గం 5:30 ని.లకు హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో నా ఇంటి వద్ద ముగిసింది. ఆ రాత్రికి పొరిగింటి వారి ఇంటిలోనే సేదతీరాము. ఆదివారం రోజున మా ఇంటిలో రంగులు వేయించుకొని మరియు శుభ్రం చేయించుకున్నాము. నా ఆప్తమిత్రుడు మల్లిక్ రాగంపూడి సహృదయంతో విందుభోజనం ఆరగించాము. మరుసటి రోజు సోమవారం నా స్వగృహప్రవేశం చేశాము. ఆ తరువాత రెండు రోజులు పుణే నుండే పరిచయం ఉన్న కుటుంబ మిత్రులు శ్రీ సంపత్ కుమార్ గారు భోజన ఏర్పాట్లు చేశారు.


పుణే నుండి సామాన్లు గురువారం రోజున చేరాయి. ఆరోజు నుండి మొదలయిన గృహకార్యం ఈ నాటికీ కూడా విరామం లేకుండా జరుగుతూనే ఉంది, మరో నెల రోజుల వరకూ ఉంటుంది అని భావిస్తున్నాము.

మా అమ్మాయిలు ఇద్దరూ మొదటి రోజునుండే అంతర్జాల సహాయంతో జరుగుతున్న పాఠాలతో విరామం లేకుండా ఉన్నారు, మధ్య మధ్యలో పరీక్షలు కూడా వ్రాయడం జరిగింది. పెద్దమ్మాయి హరిచందన 11 వ తరగతి సెంటియా విద్యాలయం, హైదరాబాద్ నగరం లో చదువుతోంది. చిన్న అమ్మాయి సిరివందన 7 వ తరగతి పుణే లోని విద్యాలయంలోనే చదువుతోంది.


వరుస వానలతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోందనే వార్తలు, దృశ్యాలు చూస్తున్నాము. కాని పుణేలో వానలకు అలవాటు పడిన మా కుటుంబానికి ఇక్కడి వాతావరణం బాగా నచ్చింది. ప్రస్తుత సామాజిక వాతావరణంలోని కరోనా వ్యాధి ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటివరకూ మీ అందరికీ తెలియజేయనందుకు అన్యధాభావించవద్దు. ఇటువంటి పరిస్థితిలో కూడా కొంతమంది మిత్రులు మా కుటుంబానికి ఎంతో సాయం చేశారు. మొదటి వారం రోజులు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా మాకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. వారందరికీ శతధా ధన్యవాదములు. త్వరలోనే భాగ్యనగరంలోని మిత్రులు అందరితో స్వయంగా దూరవాణి ద్వారా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నిన్నటి రాత్రి మా ఇంటి ప్రక్కన వీధిలో ఉండే మిత్రుడు ఆంజనేయులు ఇంటికి వెళ్లి స్వయంగా వాళ్ల అబ్బాయి చి. ప్రణవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం వచ్చింది. చాలా సంతోషం అనిపించింది.

సుదీర్ఘమైన ఈ బ్లాగును చదివినందుకు ధన్యవాదములు. వీలయితే మీ అభిప్రాయాన్ని ఈ క్రింద వ్రాయండి, ధన్యవాదములు. మీ మిత్రుడు నటరాజు