Tuesday, October 20, 2020

మూడు వారముల హైదరాబాద్ జీవితం

 మూడు వారముల హైదరాబాద్ జీవితం


గడచిన వారం రోజులనుండి ఈ బ్లాగ్ వ్రాయాలనే నా ప్రయత్నం ఈ రోజు సుసంపన్నం అయింది. ముఖ్యంగా పోయిన ఆదివారం నాటి అర్ధశత కి.మీ. దూరంతో హైదరాబాద్ లో మొదలయిన నా సైకిల్ ప్రయాణం ఉత్సాహాన్ని ఇచ్చి ఉండవచ్చు. 


సెప్టెంబర్ 26 వ తేదీ శనివారం రోజున ఉ. 5:30 ని.లకు పుణే నగరం నుండి మొదలయిన నా కుటుంబ ప్రయాణం సాయంత్రం గం 5:30 ని.లకు హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో నా ఇంటి వద్ద ముగిసింది. ఆ రాత్రికి పొరిగింటి వారి ఇంటిలోనే సేదతీరాము. ఆదివారం రోజున మా ఇంటిలో రంగులు వేయించుకొని మరియు శుభ్రం చేయించుకున్నాము. నా ఆప్తమిత్రుడు మల్లిక్ రాగంపూడి సహృదయంతో విందుభోజనం ఆరగించాము. మరుసటి రోజు సోమవారం నా స్వగృహప్రవేశం చేశాము. ఆ తరువాత రెండు రోజులు పుణే నుండే పరిచయం ఉన్న కుటుంబ మిత్రులు శ్రీ సంపత్ కుమార్ గారు భోజన ఏర్పాట్లు చేశారు.


పుణే నుండి సామాన్లు గురువారం రోజున చేరాయి. ఆరోజు నుండి మొదలయిన గృహకార్యం ఈ నాటికీ కూడా విరామం లేకుండా జరుగుతూనే ఉంది, మరో నెల రోజుల వరకూ ఉంటుంది అని భావిస్తున్నాము.

మా అమ్మాయిలు ఇద్దరూ మొదటి రోజునుండే అంతర్జాల సహాయంతో జరుగుతున్న పాఠాలతో విరామం లేకుండా ఉన్నారు, మధ్య మధ్యలో పరీక్షలు కూడా వ్రాయడం జరిగింది. పెద్దమ్మాయి హరిచందన 11 వ తరగతి సెంటియా విద్యాలయం, హైదరాబాద్ నగరం లో చదువుతోంది. చిన్న అమ్మాయి సిరివందన 7 వ తరగతి పుణే లోని విద్యాలయంలోనే చదువుతోంది.


వరుస వానలతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతోందనే వార్తలు, దృశ్యాలు చూస్తున్నాము. కాని పుణేలో వానలకు అలవాటు పడిన మా కుటుంబానికి ఇక్కడి వాతావరణం బాగా నచ్చింది. ప్రస్తుత సామాజిక వాతావరణంలోని కరోనా వ్యాధి ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటివరకూ మీ అందరికీ తెలియజేయనందుకు అన్యధాభావించవద్దు. ఇటువంటి పరిస్థితిలో కూడా కొంతమంది మిత్రులు మా కుటుంబానికి ఎంతో సాయం చేశారు. మొదటి వారం రోజులు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా మాకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. వారందరికీ శతధా ధన్యవాదములు. త్వరలోనే భాగ్యనగరంలోని మిత్రులు అందరితో స్వయంగా దూరవాణి ద్వారా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నిన్నటి రాత్రి మా ఇంటి ప్రక్కన వీధిలో ఉండే మిత్రుడు ఆంజనేయులు ఇంటికి వెళ్లి స్వయంగా వాళ్ల అబ్బాయి చి. ప్రణవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం వచ్చింది. చాలా సంతోషం అనిపించింది.

సుదీర్ఘమైన ఈ బ్లాగును చదివినందుకు ధన్యవాదములు. వీలయితే మీ అభిప్రాయాన్ని ఈ క్రింద వ్రాయండి, ధన్యవాదములు. మీ మిత్రుడు నటరాజు

1 comment: